Sunday 22 January 2023

జగన్..తస్మాత్ జాగ్రత్త!

 

రాజకీయ నాయకుడి గా జగన్ ఆలోచనా విధానానికి ఓ నమస్కారం.

జగన్ కు సలహాలు ఇస్తున్న వారికి మరిన్ని నమస్కారాలు

సలహాలు ఇవ్వడం లేదు..ఇదంతా జగన్ కు పుట్టిన బుద్దే అంటే పది వేల నమస్కారాలు.

ఎందుకంటే మొండి వాడు రాజు కన్నా బలవంతుడై వుండొచ్చు. కానీ రాజుకు మొండితనం పనికి రాదు. ఆ మాటకు వస్తే మొండితనం ఎవ్వరికీ పనికి రాదు. అది వేరే సంగతి. ఎందుకంటే మొండితనం శృతి మించితే మూర్ఖత్వంగా మారుతుంది. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు..కుందేంటి కొమ్ము సాధించవచ్చు..అన్న నీతి పద్యం వుండనే వుంది. మూర్ఖత్వానికి పోయేవారి మనసును ఎవ్వరూ మార్చలేరు. రాజకీయ నాయకుడిగా జగన్ మూర్ఖత్వానికి పోతే నష్టపోయేది కేవలం ఆయన మాత్రమే కాదు. ఆయన ను నమ్మి రాజకీయాల్లో కొనసాగుతున్న, రాజకీయ కార్య కలాపాలు సాగిస్తున్న, వ్యాపారాలు వెలగబెడుతున్న అనేకానేక మంది నాయకులు, అనుచర గణం కూడా.

జగన్ అధికారంలోకి వచ్చే వరకు ఈ నాయకులు, అనుచర గణం అంతటికీ సమస్య ఏమీ లేదు. ఎందుకంటే అప్పటి వరకు అధికారంలో లేరు కనుక అందరి దృష్టి ఈ అధికారంలోకి రాని జగన్ మీదే తప్ప, మిగిలిన వారి మీద కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు, ఆరు నూరైనా జగన్ అధికారంలో వుండకూడదు. ఇలా మాటల్లో అనడం సింపుల్. కానీ అస్సలు జగన్ అనే వాడు మరోసారి అధికారంలోకి ఎట్టి పరిస్థితిల్లోనూ రాకూడదు.

ఇది చావో రేవో సమస్య. ఒక పార్టీకి..ఒక కులానికి..ఒక వర్గానికి..ఒక కుటుంబానికి..ఈ యుద్దంలో గెలవాల్సిందే. లేదా మరణమే. ఇంతటి తీవ్రమైన పరిస్థితి ఆంధ్రలో నెలకొన్నపుడు..ఆ సంగతి జగన్ కు తెలియంది కాదు. కానీ ఇలా తెలిసిన తరువాత కూడా మొండిగా, మూర్ఖంగా ముందుకు వెళ్లడం అంటే నూటికి నూరు పాళ్లు ఆత్మహత్యా సదృశం అవుతుంది తప్ప వేరు కాదు. కురుక్షేత్ర యుద్దం కోసం ధర్మరాజు, ధుర్యోధనుడు తమ దగ్గర వున్న సేనలతో కొట్టేసుకుని వుండొచ్చు. కానీ ఎవరికి వారు ఎందుకు బంధువులను, స్నేహితులను ఇలా ఎక్కడ అవకాశం వుంటే అక్కడి వారందరినీ చేరవేసుకుని అక్షౌహినీ సేనలను పోగు చేసుకున్నారు. కృష్ణుడు యుద్దం చేయకపోయినా ఫరవా లేదు తనవైపు వుండాలని అర్జునుడు కోరుకున్నాడు. శల్యుడి మాటలు భరించి అయినా అతగాడే సారథ్యం కావాలని కర్ణుడు ఎందుకు పట్టు పట్టాడు?

ఎందుకంటే అదే ఆఖరు యుద్దం..గెలవటమో..ఓడడమో కాదు..బతుకో..చావో..ఇప్పుడు ఆంధ్రలో జరుగబోయే రాజకీయ యుద్దం అలాంటిదే.

గత కొన్ని నెలలుగా జగన్ మీద ఓ బలమైన ప్రచార యుద్దం జరుగుతోంది. జగన్ అనేవాడు వుండడం వల్ల ఆంధ్ర అధోగతిలోకి జారిపోయింది అనే ప్రచారం సాగుతోంది. రోడ్లు బాగా లేవు అని నానా యాగీ చేసారు. కానీ ఇప్పుడు రోడ్లు అన్నీ బాగు చేసారు. ఒక్క వార్త రాయలేదు. స్కూళ్లు బాగయ్యాయి. ఒక్క వార్త రాయలేదు. ఇప్పుడు తెలుగునాట కులపిచ్చతో కొట్టుకుంటున్న సామాజిక మీడియా ఒకటే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. జగన్ ఇస్తున్న సంక్షేమ తాయిలాలు మరిపించేలా నెగిటివ్ ప్రాపగండా జరగాలి. లేదూ అంటే తమకు, తమ వ్యాపారాలకు భవిష్యత్ లేదు.

చంద్రబాబు టైమ్ లో నెగిటివ్ వార్తలు అన్నీ గోతిలో కప్పెట్టేసిన ఇదే మీడియా సంస్థలు ఇప్పుడు జగన్ కు సంబంధం లేని వాటిని కూడా అతని పాలనకే ముడిపెట్టేస్తూ పేజీలు నింపేస్తున్నాయి. పాజిటివ్ వార్తలును న్యూస్ ప్రింట్ చాటున, లోకల్ ఎడిషన్ ల చాటున కప్పెట్టేస్తున్నాయి.

ఇలాంటి టైమ్ లో జగన్ నిర్ణయాలు ఎలా వుండాలి. తీసుకునే చర్యలు ఇంకెంత ఆదర్శవంతంగా వుండాలి. కదలికలు ఎంత జాగ్రత్తగా వుండాలి. తనను, తన పార్టీని ఎంత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలి. 175 కి 175 సీట్లు వచ్చేయాలి, తెచ్చేయాలి అని పదే పదే చెప్పేయడం, హుకుంలు జారీ చేయడం కాదు. ఆ 175 ఎలా సాధించాలి అన్నది చూడాలి కదా.

కేవలం ఓటర్లలో సగం మందికి నెలనెలా ఏదో రూపంలో సాయం అందించేస్తే సరిపోతుందా?

ఉద్యోగులు ఓట్లు వేయక్కరలేదా? మధ్య తరగతి వారు మీకు అక్కరలేదా? హిందూ భావజాలం వున్న వారు, బ్రాహ్మణుల ఓట్లు అక్కరలేదా?

నానా బాధలు పడి, కిందా మీదా పడిపోయి బటన్ నొక్కి సమయానికి డబ్బులు వేయగలిగే సత్తా కలిగిన జగన్ అదే పని ఉద్యోగస్థుల కోసం చేయలేరా?

జగనన్న కాలనీలు అంటూ హడావుడి చేస్తున్న వారు..మధ్య తరగతి కాలనీలు పెద్ద ఎత్తున చకచకా సాగించలేరా?

హిందూ భావజాలాన్ని, బ్రాహ్మణ ఓటు బ్యాంక్ ను నెగిటివ్ చేస్తూ జరుగుతున్న ప్రచారాన్ని ఎక్కడిక్కడ బహిరంగంగా ఖండించలేరా?

మొండిగా అపాయింట్ మెంట్ లు ఇవ్వకుండా, నాయకుల్లో అసంతృప్తి పెంచడం అవసరమా? రాజకీయాల్లో విశిష్ట వ్యక్తిత్వం వుండొచ్చు. విలక్షణ శైలి వుండొచ్చు. కానీ నలుగురికి కలుపుకుని వెళ్లడం చాలా అవసరం. మన చుట్టూ వున్నవాళ్లలో వెన్నుపోటు దారులు వుండొచ్చు. నయవంచకులు వుండొచ్చు.కానీ వీరందరినీ చుట్టూ పెట్టుకునే కదా వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయం చేయగలిగింది. అందరివాడు అనిపించుకోగలిగింది.

కంట్రోలు చేయగలిగిన వాడే డాబర్ మన్ ను పెంచుతాడు. అలా చేయలేని వాడు దానిని దూరం పెట్టి పమేరేయన్ నో పిల్లి పిల్లనో పెంచుతాడు. ఇలా చేస్తే శక్తివంతమైన అండ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక చిన్న అపాయింట్ మెంట్ ఇచ్చి వుంటే రఘురామ కృష్ణం రాజు అనే తలకాయనొప్పి వుండేది కాదు కదా? అయ్యన్న తో..గంటాతో.. తలకాయనొప్పిని అధికారం వున్నప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు భరిస్తున్నారు కానీ ఎవరో ఒకరిని దూరం చేసుకోలేదు కదా?

గడ్డి మొక్క ఆదర్శం కావాలి జగన్ గారూ..పెరుగాలి వస్తే మర్రి మాను తలెత్తుకుని వుంటుంది ఇగో కి పోయి. గడ్డి మొక్క తలవంచి వుంటుంది కాస్సేపు. మర్రి మాను నేల కూలుతుంది. గడ్డి మొక్క మళ్లీ తలెత్తి తన పని తాను చేసుకుంటుంది.

ధైర్యంగా, సవాలుగా, బతికినన్నాళ్లు ఎదురులేని వీరుడిగా, మగాడిగా వున్నాడ్రా అనిపించుకోవడం అన్నది సబబే. కానీ రాజకీయాల్లో పనికి రాదు. సరిపోదు. కుదరదు. పివి నరసింహారావును మహానుభావుడు అని ఇప్పుడు అంటున్నారు. అదే పివి ని చాలా అవమాన కర రీతిలో కిందకు దింపారు కదా ఆంధ్ర ముఖ్యమంత్రిగా వున్నపుడు..ఎందుకంటే అప్పటికి రాజకీయం చేయడం, రాజకీయాలను ఎదుర్కోవడం పివి వల్లనే కాలేదు కనుక.

లోకేష్ పాదయాత్రకు జగన్ ఇంతలా భయపడాలా? ఇంకేం రాజకీయం చేస్తారు? అతగాడి పాదయాత్రకు అన్ని అడ్డంకులు అవసరమా? ఇవన్నీ దేనికి సాయం చేస్తాయి. నిత్యం జగన్ వ్యతిరేక వార్తలు వండి వార్చి, భయపడుతున్నాడు అనే కలరింగ్ ఇచ్చి, లోకేష్ ను హీరోను చేయడానికి తప్ప.

రాహుల్ పాదయాత్ర కు ఇలాంటి షరతులే పెట్టారా? మోడీ కానీ ఆయన ముఖ్యమంత్రులు కానీ? అసలు లోకేష్ యాత్ర అనుమతికి ఆ కండిషన్లు ఏమిటి? ఇదేమైనా యమర్జన్సీనా? యమర్జన్సీ ఇందిర‌ను అధికారానికి దూరం చేసిన సంగతి మరిచిపోతే ఎలా? అణచివేత అన్నది ఎప్పుడూ ప్రజల్లో నెగిటివిటీని పెంచుతుంది. ఎన్ని యాత్రలు చేసుకుంటారో చేసుకోండి..ఎన్ని ప్రచారాలు చేసుకుంటారో కానివ్వండి..నా రాజకీయం నేను చేసుకుంటా..నా బలం నేను పెంచుకుంటా..నా ఓటు బ్యాంక్ నేను సమీకరించుకుంటా అనేలా జగన్ ముందుకు సాగాలి తప్ప ఇలా కాదు. ముమ్మాటికీ కాదు.

ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇంకా ఏణ్ణర్థం సమయం వుంది. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా జగన్ దృష్టి పెట్టాలి. కేవలం డబ్బులు పంచే పని మాత్రమే చేసుకుంటూ పోతే… మొండితనం అనిపించుకుంటుంది.. అది మూర్ఖత్వంగా మారి, మొదటికే మోసం తెస్తుంది..

జగన్..తస్మాత్ జాగ్రత్త!

Monday 2 January 2023

మీటింగుల్లో మరణాలు

 తాయిలాలు పంచుతామని ప్రచారం చేసి 350 రూపాయిల నాసిరకం సరుకుల సంచి అదికూడా అందరికీ పంచలేక .. ఆనక తొక్కిసలాటలో ముగ్గురు నిండు ప్రాణాలు తీసిన ఈ ప్రభుద్దుల వలలో ఇంకా మన జనం పడుతున్నారు అంటే... పేదరికం పోలేదు ఇంకా